ఆస్తానా: రష్యా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం రెండో రోజు ఆదివారం కజకిస్తాన్ రాజధాని అస్తానా నగరంలో పర్యటిస్తోంది. ఈ సందర్బంగా సీఎం బృందానికి కజకిస్థాన్ రాయబారి ఆదివారం ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అస్తానాల మధ్య పరస్పర సహకారాన్ని ఆశిస్తున్నామని చంద్రబాబాబు బృందంతో కజకిస్థాన్ రాయబారి అన్నారు. అలాగే ప్రసిద్ధ బేతెరెక్ టవర్‌ను చంద్రబాబు బృందం సందర్శించింది. టవర్ నుంచి ముఖ్య రాజధాని ప్రాంతాన్ని బృందం పరిశీలించి...దాని పైనుంచి నగరాన్ని వీక్షించారు. 1997లో అస్తానాను రాజధానిగా ప్రకటించినందుకు స్మృతిగా 97 మీటర్ల ఎత్తులో బేతెరెక్ టవర్‌ను నిర్మించారు.
అనంతరం ఆస్తానా నగర మేయర్ అసెట్ ఇస్సెకేషెవ్‌తో చంద్రబాబు బృందం భేటీ అయింది. అమరావతి నిర్మాణంలో అస్తానాతో కలిసి పనిచేయలనుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. ఒకసారి అమరావతిని సందర్శించాలని మేయర్‌ను ఆహ్వానించారు. అస్తానా సహకారం పై ఓ రోడ్ మ్యాప్ రూపొందించుకుందామని చంద్రబాబు కోరారు. దీనిపై స్పందించిన అస్తానా మేయర్ అమరావతి అభివృద్ధి కి మా సహకారం తప్పకుండా ఉంటుందని చంద్రబాబుతో అన్నారు. భారత రాజకీయాల్లో మీ (చంద్రబాబు) క్రియాశీల పాత్ర గురించి తమకు తెలుసునని మేయర్ వ్యాఖ్యానించారు. ఐటీ, సాంకేతిక రంగాల్లో బాబు చూపిన చొరవ గురించి తెలుసునని, ఏపీతో సంబంధాలు నెరపాలని భావిస్తున్నామని, మన మైత్రి ఉభయ తారకంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ నుంచి వచ్చే పెట్టుబడిదారులకు అస్తానాలో అవకాశాలు ఉన్నాయని, తమ రవాణా శాఖ మంత్రితో మాట్లాడి అస్తానా నుంచి అమరావతికి నేరుగా విమాన సర్వీస్ నడిపేందుకు ప్రయత్నిస్తానని మేయర్ అసెట్ ఇస్సెకేషెవ్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. దీంతో ఇరు ప్రాంతాల మధ్య పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని మేయర్ అభిప్రాయపడ్డారు. ఏపీ నుంచి ఐదుగురు, అస్తానా నుంచి ఐదుగురు సభ్యులతో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామని, రెండ్రోజుల్లో అస్తానా టీమ్ ను నామినెట్ చేస్తామని మేయర్ పేర్కొన్నారు. అస్తానా నిర్మాణంలో పాలు పంచుకున్న రూపశిల్పులు, నిర్మాణదారుల వివరాలు, వారి నిర్మాణ అనుభవాలు తెలపాలని చంద్రబాబు మేయర్‌ను కోరారు. అస్తానా నగర నిర్మాణంలో మొత్తం పదేళ్లలో 150 మంది ఆర్కిటెక్టులు పాల్గొన్నారని మేయర్ తెలిపారు. పరస్పర సహకారానికి అస్తానా-ఏపీ మధ్య త్వరలో ఎంవోయూ కుదిరే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. తర్వాత అక్కడి నుంచి చంద్రబాబు బృందం రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్ బయలుదేరింది. అక్కడ విదేశీ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికత్తేలతో ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొంటారు.
ref:http://www.andhrajyothy.com/artical?SID=264365