- అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు
- ఆమోదం పొందితే భారత ఐటికి చావుదెబ్బ్ట
వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ హెచ్-1బి, ఎల్-1 వీసాల గొడవ ప్రారంభమైంది. స్థానికుల ఉద్యోగ అవకాశాలు దెబ్బతీస్తున్న ఈ వీసాలను రద్దు చేయాలని అమెరికా కాంగ్రెస్‌లోని దిగువ సభ... ప్రతినిధుల సభలో ఇద్దరు సభ్యులు ఒక బిల్లు ప్రవేశ పెట్టారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు డానా రొహ్రబాచర్, డెమొక్రటిక్ పార్టీ సభ్యుడు బిల్ పాస్కరెల్ ఈ బిల్లు ప్రవేశ పెట్టారు. వీరిద్దరూ భారతీయులు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియా, న్యూజెర్సీ రాష్ట్రాల నుంచే ఎన్నికయ్యారు. ‘ద హెచ్-1బి, ఎల్-1 వీసాల సంస్కరణల చట్టం, 2016’ పేరుతో ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టారు. యాభై మంది కంటే ఎక్కువ ఉద్యోగులుండి, అందులో సగానికిపైగా హెచ్-1బి, ఎల్-1 వీసాలపై పని చేస్తున్న కంపెనీలు, ఇక అలాంటి వీసాలపై విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకోకుండా నిషేధించాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. ఈ ఇద్దరు 2010లో కూడా ఇలాంటి బిల్లునే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. సరైన మద్దతు లేకపోవడంతో అప్పట్లో ఆ బిల్లు వీగి పోయింది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరు మళ్లీ ఈ బిల్లును కొత్తగా ప్రవేశ పెట్టడం విశేషం.
‘అమెరికా అత్యంత నిపుణులైన ఉన్నత విద్యావంతులను, హైటెక్ వృత్తి నిపుణులను సృష్టిస్తున్నా వారికి ఉద్యోగాలు లేవు. కొన్ని కంపెనీలు వీసాల దుర్వినియోగం ద్వారా విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకుంటూ వారిని దోచుకుంటున్నాయి. దీంతో మన ఉద్యోగులూ ప్రయోజనం పొందలేక పోతున్నారు’ అని పాస్కరెల్ అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ బిల్లులో పేర్కొన్న విధంగా, హెచ్-1బి, ఎల్-1 వీసాల విధానాన్ని సమూలంగా సంస్కరించాలని కోరారు. లేకపోతే కంపెనీలు స్థానికులను కాదని, తక్కువ జీతాలకు వచ్చే విదేశీయులను మరింత ఎక్కువగా ఉద్యోగాల్లో నియమించుకుని వారి శ్రమను దోచుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ రెండు విషయాలు తమకు ఏ మాత్రం ఆమోద యోగ్యం కావన్నారు. ఈ బిల్లును ప్రతినిధుల సభతో పాటు ఎగువ సభ సెనెట్ ఆమోదం పొంది, అమెరికా అధ్యక్షుడి ఆమోదానికి వెళ్లాలి. అధ్యక్షుడు కూడా ఆమోదం తెలిపితే చట్టంగా అమలులోకి వస్తుంది. అమెరికా కార్మిక సంఘాలు సైతం ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి.
భారత ఐటి కంపెనీలకు దెబ్బ
ప్రస్తుతం భారత ఐటి కంపెనీలే ఈ వీసాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి. కొత్త బిల్లు చట్టమైతే ఎక్కువగా నష్టపోయేదీ ఈ కంపెనీలే. ప్రస్తుతం భారత ఐటి ఎగుమతుల ఆదాయంలో అమెరికా వాటా 60 శాతం వరకు ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే భారత్ కు చెందిన పలు ఐటి కంపెనీల రాబడులకు కోత పడే ప్రమాదం ఉంది. ఈ కంపెనీలు ఎక్కువగా హెచ్-1బి, ఎల్-1 వీసాలపై తమ ఉద్యోగులను అమెరికా పంపించి, అక్కడి కంపెనీలకు ఐటి సేవలు అందిస్తున్నాయి. ఇపుడు ఈ కొత్త బిల్లు ఆమోదం పొందితే యాభై మందికి మించి ఉద్యోగులున్న అమెరికా కంపెనీలేవీ ఈ రెండు వీసాలపై వచ్చే భారతీయులతో సహా విదేశీయులెవరినీ ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశం ఉండదు. అదే జరిగితే అమెరికా వెళ్లి డాలర్ల కొలువుల్లో చేరాలన్న మన ఐటి నిపుణుల ఆశలకూ గండి పడనుంది.
ఇప్పటికే అనేక ఆంక్షలు
పొమ్మనలేక పొగ పెట్టినట్టు అమెరికా ఇప్పటికే అనేక రకాలుగా భారత ఐటి కంపెనీల ఆదాయాలకు గండి కొడుతోంది. ఇందులో భాగంగా గత సంవత్సరం ఈ రెండు వీసాల ఫీజు గణనీయంగా పెంచింది. ప్రస్తుతం ఒక్కో హెచ్-1బి వీసా కోసం 4,000 డాలర్లు (సుమారు రూ.2.69 లక్షలు), ఎల్-1 వీసా కోసం 4,500 డాలర్లు (సుమారు రూ.3.02 లక్షలు) చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఈ వీసాల కోసం భారత ఐటి కంపెనీలు ఏటా చెల్లించే పీజుల భారం 10 కోట్ల డాలర్ల నుంచి 40 కోట్ల డాలర్లకు పెరిగింది. ప్రధాని మోదీతో సహా భారత ప్రభుత్వ పెద్దలు అనేక సార్లు ఈ విషయాన్ని ఒబామా సర్కార్ దృష్టికి తెచ్చినా, ఫలితం శూన్యం. దీంతో అమెరికా చర్య విచక్షణా పూరితంగా ఉందని భారత.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)కు ఫిర్యాదు చేసింది.
ఏంటీ వీసాలు..
హెచ్-1 బి వీసా: ప్రత్యేక వృత్తుల్లో ప్రత్యేక నైపుణ్యం ఉన్న విదేశీయులు తాత్కాలికంగా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు ఈ వీసా ఇస్తారు. ఈ వీసా ఉన్న విదేశీయులను అమెరికా కంపెనీలు ఉద్యోగాల్లో చేర్చుకోవచ్చు. ఎల్-1 వీసా: అమెరికాతో పాటు, విదేశాల్లో కార్యాలయాలున్న అంతర్జాతీయ కంపెనీల ఉద్యోగులకు ఈ వీసాలను జారీ చేస్తారు
ref: http://www.andhrajyothy.com/artical?SID=264139
No comments:
Post a Comment