- పక్కా సమాచార సేకరణకు సర్వేలో పెద్దపీట
- సీఎంవో కార్యాలయం నిరంతర పర్యవేక్షణ
- సర్వేపై అపోహలు వద్దు: సునీత, పల్లె
ప్రజాసాధికార సర్వేలో పొరపాట్లకు తావులేకుండా సమగ్రంగా నిర్వహించేందుకు అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో 7334 కుటుంబాలకు చెందిన 17,178 మంది నుంచి సమాచారాన్ని సేకరించారు. సర్వే వివరాలు మొత్తం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండటం.. ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసేందుకు ప్రాధాన్యమిస్తుండటంతో తొలి రెండు రోజులు సర్వే కొంత నెమ్మదిగా సాగినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి సర్వే వేగాన్ని పెంచడంపై దృష్టి సారిస్తామని అంటున్నారు. సర్వే జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే వివరాలు ఎప్పటికప్పుడు సీఎంవోకు చేరేలా ఏర్పాటు చేశారు. సర్వే తీరుతెన్నులను ఐటీ శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాగా.. సర్వేపై అపోహలు, సందేహాలు వద్దని ప్రజలకు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న వారు సర్వేపై విలేకరులతో మాట్లాడారు. సర్వేకు ప్రజలందరూ సహకరించి, సమగ్రమైన వాస్తవ వివరాలు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను మరింత సమర్థంగా అందించేందుకే సర్వే చేపడుతున్నామన్నారు.
No comments:
Post a Comment