ఆంధ్రజ్యోతి, అమరావతి : నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపులకు సంబంధించిన పనులను సీఆర్డీఏ అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు విడతల వారీగా చేపట్టనున్న ప్లాట్ల కేటాయింపు ప్రక్రియపై సీఆర్డీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత గుడువు నాటికి లేఅవుట్‌తో సహా సాంకేతిక ఇబ్బందులు లేకుండా చేయనున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని 12 గ్రామాల లేఅవుట్ల రూపకల్పన పూర్తయిందని సమాచారం. మరో 7 గ్రామాలకు చెందిన లేఅవుట్లపై సీఆర్డీఏ ప్లానింగ్ విభాగం అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. నేలపాడు గ్రామానికి చెందిన ప్లాట్ల కేటాయింపులను పూర్తి చేసిన మాదిరిగానే మిగిలిన గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపులను చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 15 నుంచి విడతల వారీగా అన్ని రాజధాని గ్రామాల ప్లాట్ల రూపకల్పన లేఅవుట్లను ప్రకటించి కంప్యూటర్ ద్వారా నిర్వహించే లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక వైపు ప్లానింగ్ అధికారులు లేఅవుట్ల పై కసరత్తు చేస్తుంటే మరో వైపు విడతల వారీగా పూర్తిచేయాల్సిన పనులపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఈ లాటరీ కేటాయింపులను మూడు వారాల వ్యవధిలో పూర్తి చేసి భూములిచ్చిన రైతులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని లోపరహిరతంగా పూర్తి చేయడానికి సీఆర్డీఏలోని పలు విభాగాల అధికారులు సునిశిత పరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటున్నారు.
No comments:
Post a Comment