
మరో రెండు వారాల్లో కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు కొన్ని సూచనలు పాటించండి.
1. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నాడు ప్రజాకవి వేమన. కాబట్టి అలాంటి పుణ్యపురుషులు అయిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులకు తొలిరోజు పుష్కర స్నాన పుణ్యాన్ని వదిలెయ్యండి. ఆ రోజు ఇళ్లలోనే టీవీ చూస్తూ కూర్చోండి. బయటకు వెళ్లొద్దు.
2. తొలిరోజు " షూటింగులు" ఉంటాయి. అక్కడ మీడియా సలహాదారులు ఎప్పుడు ఏ ఘాట్లో అంతర్జాతీయ మీడియా షూటింగ్ పెడతారో తెలియదు. సిసి కెమెరాలు కూడా ఆఫ్ చేసేయవచ్చు లేదా అక్కడ పనిచేయకపోవచ్చు. అందువల్ల అనవసరం గా ఎవరి కాళ్ళ కిందనో పడి చీమల్లా చితికి పోవద్దు.
3 . మహాబలేశ్వర్లో మునిగినా, మహబూబ్ నగర్లో మునిగినా, నాగార్జున సాగర్ లో మునిగినా, విజయవాడ లో మునిగినా, మీకు వచ్చే పుణ్యం తాలూకు తూకం లో ఏమాత్రం తేడా రాదు. మరల అంత్య పుష్కరాలు కూడా ఉంటాయంట
4. నదిలో మునగడం ముఖ్యం కాదు. మళ్ళీ పైకి తేలడం ముఖ్యం.
5. మీ తోటి భక్తులకు రకరకాల చర్మ రోగాలు ఉండవచ్చు. వాటిని పట్టించుకోవద్దు. చర్మవ్యాధుల స్పెషలిస్టులు నాలుగు రాళ్లను సంపాదించుకునే అవకాశం ఇవ్వండి.
6. ముఖ్యం గా టీవీలలో దేవ , రాజ, మానుష స్నాన సమయాలు అని రద్దీ పెంచే ప్రవచనకారులు చెప్పే మాటలు నమ్మవద్దు. అసలు అలాంటివి ఈ పన్నెండు రోజులూ వినొద్దు. వారి ప్రవచనాల వల్లనే మీరు పోయారని పేపర్ వాళ్ళు రాస్తే మీ కుటుంబానికి నష్ట పరిహారం రాకపోవచ్చు. వారి అర్ధం లేని అలాంటి కొన్ని ప్రవచనాలు విని మట్టీ గిట్టీ, గట్ల మీదకి విసిరి వెనక వచ్చేవారిని నదిలోకి జారిపడే ఏర్పాట్లు చేయవద్దు. పుణ్యం కాదు కదా పాపం చుట్టుకుంటుంది.
7. నదిలో ఎన్ని మునకలు వేసాం అన్నది ముఖ్యం కాదు. ఒకటి వేసినా, వంద వేసినా ఒకటే ఫలితం.
8. కృష్ణా నది వేల సంవత్సరాలనుంచి ఉన్నది. యుగాంతం వరకూ ఉంటుంది. పుష్కరుడు అనే వాడు పన్నెండు రోజులూ ఆ నదిలోనే ఉంటాడు. కనుక చివరి రోజైనా స్నానం చెయ్యొచ్చు.
9. తొలి రోజు తొలి మునక వెయ్యాలని ఆత్ర పడవద్దు. అలా చేస్తే అదే మీకు చివరి మునక అయ్యే ప్రమాదం ఉంది.
10. మరీ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమటంటే...పుణ్యం కన్నా ప్రాణం ముఖ్యం. స్నానం వల్ల వచ్చే పుణ్యం ఎదో మీ ఒక్కరికే చెందుతుంది. కానీ మీ ఆరోగ్యం మరియు ప్రాణం మీ కుటుంబానికి చాలా అవసరం.
11. మనం జూ పార్క్ కు వెళ్ళినప్పుడు పులులు, సింహాలు ఉన్నచోటికి వెళ్లి వాటితో ఆడుకోడానికి సాహసించము. అలాగే వీ ఐ పీ లు ఉన్న చోటికి వెళ్లి స్నానాలు చెయ్యాలని పిచ్చి సాహసం చెయ్యవద్దు.
12. మీ వూరికి దగ్గరలో కృష్ణా నది ఉంటె, అక్కడే చేసెయ్యండి. దూరప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు.
పై పన్నెండు సూచనలను శ్రద్ధగా పాటించి క్షేమంగా తిరిగి రండి.
No comments:
Post a Comment