
'బాబు వస్తే జాబు వస్తుంది' అని ఆశించిన యువత 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడటంలో ముఖ్యపాత్ర పోషించారు. అది ఓర్వలేని ప్రతిపక్షం 'బాబు వచ్చాడు... జాబేదీ?' అంటూ యువత కనిపించినప్పుడల్లా వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. రెండేళ్ళ పాలన సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువతకు రెండేళ్ళలో లక్షా ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు చంద్రబాబు. దీంతో ప్రతిపక్షానికి గొంతులో వెలక్కాయ అడ్డుపడినట్టయ్యింది. ఈ రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ లో యువతకు వచ్చిన ఉద్యోగాల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.5.5 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. ఒక్క భాగస్వామ్య సదస్సులోనే 4.8 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. సత్వర అనుమతులు, భూకేటాయింపులు, ఏకగవాక్ష విధానం వంటి వాటి సంగతి అలా ఉంచితే ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రూ.2వేల కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి పారిశ్రామిక వర్గాల్లో భరోసానిచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. దాంతో ఇప్పటికే 175 ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించాయి. దాదాపు 94వేల మందికి ఉపాధి లభించింది. మరో 180 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పెట్టుబడుల హామీలన్నీ ఆచరణలోకి వస్తే మరో 7.88లక్షల మందికి ఉద్యోగాలొచ్చే అవకాశముంది.
డీఎస్సీ 2014కు 4.20 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 3.96 లక్షల మంది పరీక్షరాశారు. జూన్ 2, 2015న పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. అయితే కోర్టు కేసులతో పలు దఫాలుగా నియామక ప్రక్రియ వాయిదా పడింది. పరిపాలన ట్రెబ్యునల్ నుంచి ఈమధ్యే స్పష్టత రావడంతో నియామకాల కోసం ఏడాదిన్నరగా నిరీక్షిస్తున్న డీఎస్సీ-2014 అభ్యర్థులకు ఇటీవలే చంద్రబాబు చేతులమీదుగా నియామకపత్రాలు అందించారు. పాఠశాలలు పునఃప్రారంభం అయినప్పటి నుంచి 10వేల మంది నూతన ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. ఇక 3,634 వ్యవసాయ విస్తరణాధికారుల ఖాళీలు సహా, గిరిజన, వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ జరిగింది.
రానున్న కాలంలో 20 వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, త్వరలో 10 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఇవేకాకుండా 6 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
No comments:
Post a Comment