నరసరావుపేట : నరసరావుపేట, సత్తెనపల్లి ఎక్కడి నుంచైనా పోటీ చే సే స్వేచ్ఛను చంద్రబాబు కోడెలకు ఇచ్చారు. పోటీ నిర్ణయం నీదేనంటూ కోడెలకు ఆయన సూచించినట్టు సమాచారం. దీంతో కోడెల సందిగ్ధంలో పడ్డారు. నరసరావుపేట, సత్తెనపల్లి రెండు చోట్లలో ఎక్కడైతే విజయావకాశాలు ఎక్కువగా వున్న అంశం పై ఆయన దృష్టి సారించారు. మొత్తం పోటీ చేసే అంశంలో కోడెల ఊగిసలాటలో వున్నట్టు తెలుస్తుంది. మంగళవారం ఆయన నరసరావుపేటకు వస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై చర్చంచనున్నారు. క్యాడర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై నిర్ణ యం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. నరసరావుపేట నియోజక వర్గంలో తన సొంత సామాజిక వర్గం ఏ మేరకు సహకరిస్తుందనే అంశంపై కోడెల సందిగ్ధంలో వున్నారు. రొంపిచర్ల మండలంలోని మూడు గ్రామాలు, నరసరావుపేట మండలంలోని రెండు గ్రామాలలో తన సామాజిక వర్గానికి సంబందించిన నేతలతో చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ గ్రామాలలో కూడా తనకు సంపూర్ణ మద్దతు లభిస్తే నరసరావుపేట నుంచే పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని కోడెల నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సత్తెన పల్లిలో కూడా కోడెలకు గెలుపు అవకాశాలు అంత స్పష్టంగా ఏమి లేవు. ఇక్కడ కూడా ప్రత్యర్థి నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వుంటుంది. రెండు నియోజక వర్గాల్లో నరసరావుపేటే కోడెలకు అనుకూలంగా వుంటుందన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంట్‌కు గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఐదు గ్రామాలలో వారి సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసేందుకు రాయపాటి కృషి చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన అనుచరులు ఆయా గ్రామాలలోని నేతలతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఇప్పటికే పలు మార్లు నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని, ఇంకొక చోటకు వెళ్ళాల్సిన అవసరం తనకు లేదని, ఐదు సార్లు గెలిపించిన ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిదని, వీరికే మరోసారి సేవలు అందించేందుకు పని చేస్తానని కోడెల చెప్పిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఆదివారం తెరపైకి బీజేపీకి నరసరావుపేట టిక్కెట్ కేటాయింపు వ్యవహారం వచ్చింది. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ ఢీలా పడింది. అధిష్ఠానం నిర్ణయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నరసరావుపేట నుంచే పోటీ చేయాలని కోడెల పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు సమాయత్త మవుతున్నాయి. ఇక్కడ లేని విజయావకాశాలు సత్తెనపల్లిలో ఎలా వుంటాయని? కోడెలను వారు నిలదీస్తున్నారు. కోడెల కోసమే పార్టీలో కష్టపడి పని చేస్తున్నామని, ఆయన కోసం పని చేయటం వలన తమ పై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయని, ఇలా తాము పోరాడుతుంటే కోడెల సత్తెనపల్లి వెళ్ళేందుకు ప్రయత్నించటం సరి కాదని, ఈ చర్య తమను మోసగించటమే అవుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద రెండు రోజుల్లో కోడెల ఎక్కడి నుంచి పోటీ చేసే అంశం పై స్పష్టత రానుంది.
Friday, April 11, 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment