.jpg)
రాజకీయాలలో అపర చాణక్యుడని పేరుగాంచిన తెరాస అధ్యక్షుడు ఎప్పటికప్పుడు వేసే కొత్త ఎత్తులు, పన్నే సరికొత్త వ్యూహాలను పసికట్టడం ప్రత్యర్ధ పార్టీలకు కూడా సాధ్యం కాదు. ఆయన ఏ రోజు ఏమీ మాట్లాడి ఎవరి మీద ఎటువంటి బాంబులు పేలుస్తారో, ఎప్పుడు ఏ ఎత్తుగడతో ఏ దిశలో ముందుకు సాగుతారో ఎవరికీ అంతుపట్టదు. నిన్న కరీంనగర్ లో తెరాస నిర్వహించిన బహిరంగ సభలో ఎవరూ ఊహించని విధంగా ఆయన మరో సరికొత్త పల్లవి అందుకొన్నారు.
“తెరాస నూటికి నూరు శాతం సెక్యులర్ పార్టీ అని, అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్వ పార్టీలతో చేతులు కలపబోమని, అదేవిధంగా బీజేపీ నేతృత్వం వహిస్తున్న ఎన్డీయే కూటమిలో కానీ, కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న యూపీఏ కూటమిలో గానీ చేరబోమని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమ పార్టీ థర్డ్ ఫ్రంట్ లో చేరుతుందని, ఫ్రంట్ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని ఆయన తెలిపారు. బీజేపీ చెప్పుకొంటున్నట్లుగా ఆ పార్టీకి కనీసం 200 సీట్లు కూడా రావని, అందువల్ల ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం అసంభవమని తేల్చి చెప్పేశారు. అందుకు మంచి బలమయిన కారణం కూడా ఆయనే చెప్పారు. ఈసారి ఎన్నికలలో దేశమంతటా ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని, అందువల్ల వారందరూ కలిసి ఏర్పాటు చేసుకొన్నా థర్డ్ ఫ్రంట్ కూటమే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తధ్యమని” ఆయన జోస్యం చెప్పారు.
అయితే కొద్ది రోజుల క్రితమే, ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోకపోయినప్పటికీ, ఎన్నికల తరువాత ఆ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ, ఆ తరువాత బీజేపీతో పొత్తులకు కూడా కేసీఆర్ ప్రయత్నించారు. ఇప్పుడు వాటికి మద్దతు ఈయబోమని చెపుతున్నారు. ఇంతవరకు తమది ఉద్యమపార్టీ అని చెప్పుకొంటున్నఆయన అకస్మాత్తుగా తమ పార్టీకి సెక్యులర్ రంగు వేసుకోవడం, బీజేపీకున్న మతతత్వ ముద్ర గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తావించడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది.
అయితే దేశమంతా మోడీ హవా నడుస్తున్నసంగతి కేసీఆర్ కి తెలియదని భావించలేము. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీతో కంటే బీజేపీతోనే ఎన్నికల పొత్తులకి ఆసక్తి చూపారు. కానీ బీజేపీ తమను కాదని తెదేపాతో పొత్తులు పెట్టుకోవడంతో సహజంగానే బీజేపీ శత్రువుగా మారింది. అందువల్లనే ఆయనకు ఇప్పుడు బీజేపీలో మతత్వం మరింత స్పష్టంగా కనబడుతోంది. అదేవిధంగా ఇప్పుడు తెరాస ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలతో పోరాడుతోంది గనుకనే ఆ రెండు పార్టీలకు మద్దతు ఈయమబోమని చెపుతూ, ప్రజలను నమ్మించేందుకు ఎక్కడా కనబడని థర్డ్ ఫ్రంట్ గురించి చెపుతున్నారు. ఇక ఈ ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్, తెదేపా-బీజేపీ కూటమి చాలా బలంగా ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అందువల్ల ఆయన కూడా వాటిని అంతే గట్టిగా విమర్శిస్తూ ఎదిరిస్తూ మాట్లడినప్పుడే ప్రజలు తెరాసను విశ్వసించే అవకాశం ఉంది.
No comments:
Post a Comment