Friday, April 11, 2014

కారుకు ఫ్యాను గాలి!

కాంగ్రెస్ ఓట్లకు చిల్లు.. టీఆర్ఎస్‌కు మేళ్లు
ఓట్ల చీలికే లక్ష్యంగా తెలంగాణలో వైసీపీ పోటీ
కాంగ్రెస్‌కు బలమైన స్థానాల్లో రెడ్డి అభ్యర్థులు
బలం లేకపోయినా తెలంగాణ బరిలోకి
106 అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాల్లో పోటీ
ప్రతివ్యూహం రచిస్తున్న కాంగ్రెస్
ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసే దిశగా పైఎత్తులు
వైసీపీ అభ్యర్థులను దారికి తెచ్చుకునే యత్నం
(హైదరాబాద్ ) సమైక్య వాదాన్ని వినిపించిన వైసీపీకి తెలంగాణలో అసలు అభ్యర్థులు ఉంటారా!? చిట్టచివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగిన బాజిరెడ్డి గోవర్ధన్ వంటి నేతలు కూడా జగన్‌కు బై చెప్పి ఇతర పార్టీల్లో చేరాక.. తెలంగాణలో వైసీపీ మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికి ఉంటుందా!? ప్రత్యేక రాష్ట్ర విజయమే ఎజెండాగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు సమైక్యవాద వైసీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగడానికి ఎవరైనా సాహసిస్తారా!? నిన్న మొన్నటి వరకు చాలామందిని వేధించిన ప్రశ్నలివి! కానీ, ఈ సందేహాలను పటాపంచలు చేస్తూ తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 106 చోట్ల.. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 13 చోట్ల వైసీపీ తన అభ్యర్థులను నిలబెట్టింది. తెలంగాణ వాదం కాస్త తక్కువగా ఉండే ఖమ్మం జిల్లా, హైదరాబాద్ శివారు నియోజక వర్గాల్లోనే కాకుండా తెలంగాణ పోరుగడ్డల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది.
తొలుత 30 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం కావాలని భావించినా.. సామాన్య ప్రజలను కూడా తీవ్ర విస్మయానికి గురి చేస్తూ చివరికి వచ్చేసరికి దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ రంగంలోకి దిగింది! రాష్ట్ర విభజనతో సీమాంధ్రకే పరిమితమైన వైసీపీ.. ఏమాత్రం బలం లేకపోయినా, తెలంగాణలోనూ అత్యధిక సీట్లలో పోటీకి సిద్ధపడడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. అందులోనూ.. కాంగ్రెస్‌కు బలమైన నియోజక వర్గాల్లో ఆ పార్టీకి కంచుకోటలాంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దించడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, వైసీపీ దూకుడు వెనక టీఆర్ఎస్ యువనేత హస్తం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టి పరోక్షంగా టీఆర్ఎస్‌కు సహకరించడమే లక్ష్యంగా పావులు కదిలాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. "ఫ్యాను ఎంత వేగంగా తిరిగితే కారు అంత స్పీడుగా ముందుకు దూసుకుపోతుంది కదా!'' అంటూ టీఆర్ఎస్, వైసీపీ బంధాన్ని విశ్లేషిస్తున్నారు.
ఈ మేరకు టీఆర్ఎస్‌కు చెందిన యువనేత ఒకరు వైసీపీ నాయకత్వంతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజక వర్గాల్లో వైసీపీ తరఫున ఎవరెవరిని నిలపాలో కూడా ఆయనే డిసైడ్ చేసినట్లు తెలిసింది. "వైసీపీ సమైక్య వాదానికి జైకొట్టడానికి ముందు తెలంగాణలోని వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, క్రిస్టియన్ మైనారిటీలు వైసీపీకే అండగా నిలిచారు. వైసీపీ సమైక్యవాద జెండా ఎత్తుకున్న తర్వాత వారంతా తిరిగి తమ సొంత గూడైన కాంగ్రెస్‌కు వచ్చేశారు. వైఎస్ అభిమానులు, క్రిస్టియన్ మైనారిటీల ఓట్లు చీల్చడానికే ఫ్యాను గాలి సాయం కారు కోరింది'' అని కాంగ్రెస్ నేత ఒకరు వివరించారు. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకును కొల్లగొడితేనే కారుకు దారి దొరుకుతుందన్న ఆలోచనే ఇంత పెద్ద కథ నడవడానికి కారణమని వివరించారు. వైసీపీ తెలంగాణ నాయకులంతా ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడాన్ని ఈ సందర్భంగా ఉదాహరిస్తున్నారు. కొండా దంపతులు, కేకే మహేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులను టీఆర్ఎస్‌లోకి పంపించింది జగనే అన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది.
సమైక్యవాదానికి జై కొట్టిన పార్టీల నేతలను చేర్చుకోవద్దంటూ తెలంగాణ జేఏసీ స్పష్టం చేసినా వైసీపీ నేతలకు గులాబీ కండువా కప్పడానికి కారణం వైసీపీ, టీఆర్ఎస్ బంధమేనన్న ప్రచారం కూడా ఉంది. వైసీపీ నుంచి బయటకు వెళ్లిన ఈ నేతలు తొలుత కాంగ్రెస్ గూటికి వెళ్లి.. అక్కడి నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లడాన్ని వివరిస్తున్నారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించి.. టీఆర్ఎస్‌ను తిట్టిపోసిన ఈ నేతలకు గులాబీ కండువా కప్పడమే కాకుండా వెన్వెంటనే టికెట్లు కూడా ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి, తొలుత నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి షర్మిలను పోటీ చేయించాలని జగన్ భావించినా.. టీఆర్ఎస్, వైసీపీ లోపాయికారీ ఒప్పందంతోనే ఆ ఆలోచనను విరమించుకున్నారని వైసీపీలోని కీలక నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్‌కు ఇచ్చిన సహకారం కారణంగా ఖమ్మంలో వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ సహకరించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు.
ఎత్తుకు కాంగ్రెస్ పైయెత్తు
వైసీపీ, టీఆర్ఎస్ దోస్తానాను గ్రహించిన కాంగ్రెస్ తనదైన శైలిలో ప్రతి వ్యూహాన్ని రచించిందని ఆ పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. వైసీపీ ఏదో 20-30 స్థానాలకే పరిమితమవుతుందని భావించిన కాంగ్రెస్.. ఆ పార్టీ ఏకంగా వంద స్థానాలకుపైగా బరిలోకి దిగడంతో కంగుతింది. వైసీపీలో లేనివాళ్లకి.. పార్టీ ఆఫీసు ఎక్కడో తెలియని వారికి.. మరీ ముఖ్యంగా పార్టీ నుంచి బహిష్కరించిన వారికి టికెట్లు, బీ ఫారాలు ఇవ్వడం వెనక గులాబీ హస్తం ఉందని అనుమానించింది. పార్టీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా వైసీపీ, టీఆర్ఎస్ చేతులు కలిపాయని గుర్తించి.. తన సంప్రదాయ ఓటు బ్యాంకు చీలకుండా ఏకంగా వైసీపీ అభ్యర్థులనే తన దారికి తెచ్చుకోవడానికి పావులు కదిపిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వివరించాయి. వైసీపీ అభ్యర్థుల్లో సగానికి సగం మందితో కాంగ్రెస్ నేతలు టచ్‌లోకి వెళ్లినట్లు వివరించాయి.
నామినేషన్ ఉపసంహరించుకోవడానికి లేదా ఎన్నికల్లో మౌన ముద్ర దాల్చడానికి వేర్వేరుగా మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది. మహేశ్వరం వైసీపీ అభ్యర్థి దీపా భాస్కరరెడ్డి అనూహ్యంగా పార్టీని వీడడంతోపాటు వైసీపీ తరఫున వేసిన నామినేషన్‌ను కూడా ఉపసంహరించుకోవడం ఇందులో భాగమేనని సమాచారం. మరికొంతమంది కూడా ఇదే బాటలో నడవనున్నారని తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అగ్ర నాయకత్వం అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎలాగైనా బరిలో నిలవాలని, తప్పుకొనే ఆలోచన చేయవద్దని అభ్యర్థులకు లోటస్ పాండ్ నుంచి ఫోన్లు వెళ్లడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. తెలంగాణలో పోటీ చేసే ఒక్కో అభ్యర్థికి జగన్ ఐదు కోట్లు పంపే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరగడంతో 'కోటి' ఆశలతో అభ్యర్థులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జగన్ డబ్బు పంపినా పంపకపోయినా కాంగ్రెస్ ఉందన్న భరోసాతో ఉన్నట్లు సమాచారం.
నువ్వా దరిని.. నేనీ దరిని..
రాష్ట్ర విభజన జరగడానికి ముందు సీమాంధ్రలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. జగన్ సమైక్యవాదం ఎత్తుకోవడం కూడా విభజనకు సహకరించడంలో భాగమేనన్న విమర్శలూ వినిపించాయి. తెలంగాణలోనూ, హైదరాబాద్‌లోను వైసీపీ నేతలు చేపట్టిన దీక్షలు, సమైక్య సభలకు పరోక్షంగా టీఆర్ఎస్ సహకారం ఉందన్న విమర్శలు అప్పట్లో వెలువడ్డాయి. రెండు పార్టీల దోస్తానా ఎన్నికల్లో కూడా కొనసాగుతోందని, ఈ ఇద్దరు నేతలు కలిసి రెండు రాష్ట్రాల్లో తామే ఉండాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్, టీడీపీలపై విమర్శలకు దిగుతున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత కేంద్రంలో కూడా చక్రం తిప్పాలన్న యోచనలో ఇద్దరు నేతలు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు.

No comments:

 
Labels : telugu desam party, tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020 tdpyuvasena, telugu desam party songs, tdp, telugu desam, ntr life history, ntr album, ntr, bandlamudi, bandlamudi2020 tdp yuvasena, telugu desam songs, chandrababu naidu, telugudesam, ntr, ntr memories, ntr as CM, bandlamudi, bandlamudi2020