కాంగ్రెస్ పాలనలో నిత్యావసర ధరలతో సహా వంట గ్యాస్, పెట్రోలు, కరెంట్ చార్జీలు ఒకటి రెండేమిటి అన్నీ పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలు ఒక పథకం ప్రకారం నియంత్రించి, మిగులు కరెంట్ సాధించామని తెలిపారు.
నాణ్యమైన కరెంట్ రావాలంటే, నిరంతరం విద్యుత్ ఉండాలంటే, కరెంట్ ధరలు తగ్గాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్, పెట్రోల్, ఇంటి పన్నులు ఇష్టానుసారంగా పెంచిందని, ఇష్టానుసారంగా దేశాన్ని లూటీ చేసిందని ఆయన ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే, విద్యార్థులు సక్రమంగా చదువుకోవాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీకే ఓటెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.
టీడీపీ హయాంలో ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పామని, ఐటీ సంస్థలు ఏర్పాటు చేయించామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత ఒక్క టీడీపీకే దక్కిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఒకప్పుడు మల్కాజ్‌గిరి ఒక మునిసిపాటి అని, మరి ఈరోజున మహానగరంలో ఒక భాగమని ఆయన అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని, ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అభివృద్ధి జరగాలంటే యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి సైబరాబాద్‌ను ఒక నాలెడ్జ్ హబ్‌గా తయారు చేశామని, ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చంద్రబాబు వెల్లడించారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్నీ కుంటుపడ్డాయని, రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడిందని, ఎక్కడా అభివృద్ధి జరగలేదని, చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ దోచుకుందని, విదేశాల్లో దాచిపెట్టుకుందని ఆయన మండిపడ్డారు. సోనియాగాంధీ ఊరుకొక్క అవినీతి కొండను తయారు చేసింది తప్ప, ఒరగబెట్టింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి ఒక రబ్బరు స్టాంపని, రోబో అని, ఆడిస్తే ఆడతారు, లేకపోతే లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
No comments:
Post a Comment